8 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన మమతా బెనర్జీ
- మమతా బెనర్జీ స్థానంలో పార్టీ కొత్త అధ్యక్షుడిని ప్రకటించిన రెబల్ వర్గం
- మరుసటి రోజే 8 మంది కీలక నేతలపై వేటు వేసిన మమత
- టీఎంసీలో తార స్థాయికి చేరిన అంతర్గత పోరు
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు తార స్థాయికి చేరింది. 1998లో పార్టీని స్థాపించి, దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యంగా నడిపిస్తున్న అధినేత్రి మమతా బెనర్జీ స్థానంలో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తూ రెబల్ వర్గం సంచలన నిర్ణయం తీసుకుంది. దీనికి రివర్స్ కౌంటర్‌గా మమతా బెనర్జీ 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేశారు.
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ తన మాజీ రైట్ హ్యాండ్, మాజీ మంత్రి ఫిర్హాద్ హకీమ్‌తో పాటు మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి మమత శాశ్వతంగా బహిష్కరించారు. బహిష్కరణకు గురైన వారిలో ఫిర్హాద్ హకీమ్, జావేద్ అహ్మద్ ఖాన్, అరూప్ రాయ్ (రెబల్స్ ప్రకటించిన కొత్త ప్రెసిడెంట్), రథిన్ ఘోష్, బిప్లబ్ మిత్ర, సబీనా యాస్మిన్, స్నేహాశిష్ చక్రవర్తి, మాజీ మంత్రి అరూప్ బిశ్వాస్ ఉన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మొత్తం ఉన్న టీఎంసీ ఎమ్మెల్యేల్లో మెజారిటీ నేతలు తమవైపే ఉన్నారని తిరుగుబాటు వర్గం చెబుతోంది. మొత్తం 80 మంది టీఎంసీ ఎమ్మెల్యేల్లో 60 మంది సపోర్ట్ తమకే ఉందని రెబల్స్ ప్రకటించారు. ఇప్పటికే 28 మంది టీఎంసీ లోక్‌సభ ఎంపీల్లో 20 మంది ఎంపీలు గ్రూప్‌గా విడిపోయి.. 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా'లో విలీనమైన తరుణంలో... మెజారిటీ ఎమ్మెల్యేలు తిరగబడటం మమతా బెనర్జీ పార్టీ మనుగడకే ముప్పుగా మారింది.